Saturday, May 23, 2026

01. ప్రళయ పయోధిజలే ధృతవానసి వేదం

 జయదేవుని గీత గోవిందం - 24 అష్టపదులు - భావార్థ విశేషాలు 01 వ భాగం

"01. ప్రళయ పయోధిజలే ధృతవానసి వేదం"

జయదేవుడు 12వ శతాబ్దానికి చెందిన మహాకవి. ఆ కాలంలో భారతీయ సంగీతం ఉత్తర హిందూస్థానీ, దక్షిణ కర్ణాటక శైలులుగా విడిపోలేదు. ఈ యుగాన్ని చరిత్రకారులు "రాజపుత్ర యుగం" అని పిలుస్తారు. జయదేవుడు గౌడ దేశ పాలకుడైన లక్ష్మణసేనుడి (1116-1160) ఆస్థాన కవి.

భారతదేశంలో సంగీత, సాహిత్య సమ్మేళనంగా వెలసిన తొలి ప్రబంధం "గీత గోవిందం" జయదేవుని అద్భుత కృతి. ఇది 12 సర్గలతో కూడిన సంస్కృత ప్రబంధం.

ఇందులో 24 అష్టపదులు, 80కి పైగా శ్లోకాలు ఉన్నాయి. భారతదేశపు తొలి వాగ్గేయకారుడు (తాను స్వయంగా రాసి, స్వరపరచి పాడినవాడు) జయదేవుడే.

జయదేవుడు జన్మతః ఓడ్రదేశస్థుడు (ఇప్పటి ఒడిశా) అయినా వంగ దేశంలో (ఇప్పటి బెంగాల్) నివసించి, సంగీత కవిత్వంలో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. "గీత గోవిందం" నృత్యం, సంగీతానికి అత్యంత అనువైన కృతి. ఆయన రాధా-కృష్ణ భక్తి మార్గాన్ని అనుసరించి, ఆ తత్త్వాలను తన రచనల ద్వారా ప్రబోధించాడు.

గీత గోవిందంలోని అష్టపదులు అత్యంత మాధుర్యభరితమైనవి.

ప్రళయ పయోధిజలే ధృతవానసి వేదం

ఈ ప్రథమ అష్టపదిలో శ్రీకృష్ణుడు (జగన్నాయకుడు) తన పది అవతారాలను ప్రదర్శించినవాడిగా వర్ణించబడ్డాడు.
 ఆ పది అవతారాలు:

మత్స్య

కూర్మ

వరాహ

నరసింహ

వామన

పరశురామ

రామ

బలరామ

బుద్ధ

కల్కి

ఈ పది కేశవుని అవతారాలుగా జయదేవుడు కీర్తించాడు. ఈ అష్టపదిలో శబ్దమాధుర్యం, భావగాంభీర్యం కలిసిపోతాయి. అందుకే ఇది అత్యంత ప్రసిద్ధమైన అష్టపదిగా నిలిచింది.

ప్రళయ పయోధిజలే ధృతవానసి వేదం

విహిత వహిత్ర చరిత్రమఖేదం

కేశవ! ధృత మీనశరీర! జయ జగదీశ! హరే! ॥ (ధ్రువమ్‌)

క్షితిరతివిపులతరే తవ తిష్ఠతి పృష్ఠే

ధరణీ ధరణ కిణ చక్ర గరిష్ఠే

కేశవ! ధృత కచ్ఛపరూప! జయ జగదీశ! హరే!

వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్నా

శశిని కళంక కలేవ నిమగ్నా

కేశవ! ధృత సూకరరూప! జయ జగదీశ! హరే!

తవ కరకమల వరే నఖమద్భుత శృంగం

దళిత హిరణ్యకశిపు తను భృంగం

కేశవ! ధృత నరహరిరూప! జయ జగదీశ! హరే!

ఛలయసి విక్రమణే బలిమద్భుత వామన!

పదనఖ నీర జనిత జన పావన

కేశవ! ధృత వామనరూప! జయ జగదీశ! హరే!

క్షత్రియ రుధిర మయే జగదపగత పాపం

స్నపయసి పయసి శమిత భవ తాపం

కేశవ! ధృత భృగుపతిరూప! జయ జగదీశ! హరే!

వితరసి దిక్షు రణే దిక్పతి కమనీయం

దశముఖ మౌళి బలిం రమణీయం

కేశవ! ధృత రామశరీర! జయ జగదీశ! హరే!

వహసి వపుషి విశదే వసనం జలదాభం

హల హతి భీతి మిళిత యమునాభం

కేశవ! ధృత హలధరరూప! జయ జగదీశ! హరే!

నిందసి యజ్ఞవిధే రహహ శ్రుతిజాతం

సదయ హృదయ దర్శిత పశు ఘాతం

కేశవ! ధృత బుద్ధశరీర! జయ జగదీశ! హరే!

మ్లేచ్ఛనివహ నిధనే కలయసి కరవాలం

ధూమకేతుమివ కిమపి కరాలం

కేశవ! ధృత కల్కిశరీర! జయ జగదీశ! హరే!

శ్రీ జయదేవకవే రిదముదిత ముదారం

శృణు సుఖదం శుభదం భవసారం

కేశవ! ధృత దశవిధరూప! జయ జగదీశ! హరే!

భావార్థం

1. ప్రళయ పయోధిజలే ధృతవా నసి వేదం

విహిత వహిత్ర చరిత్రమఖేదం

కేశవ! ధృత మీనశరీర! జయ జగదీశ! హరే!

అర్థం: ప్రళయ సముద్ర జలాల్లో నువ్వు వేదాలను కాపాడేందుకు అవతరించావు. నీవు ఓడ వలె ప్రవర్తించి సృష్టిని రక్షించావు.
 ఓ కేశవ! నీవు మీనావతారం ధరించావు. ఓ జగదీశ్వరా! ఓ హరీ ! నీవు విజయవంతునిగా ఉండుగాక!

2. క్షితిరతివిపులతరే తవ తిష్ఠతి పృష్ఠే

ధరణీ ధరణ కిణ చక్ర గరిష్ఠే

కేశవ! ధృత కచ్ఛపరూప! జయ జగదీశ! హరే!

అర్థం: భూమి అత్యంత విస్తృతమైన సముద్రంపై తేలియాడుతున్నది. దానిని సమర్థంగా మోయడానికి నువ్వు మూపుఅ అంతా కాయలు కాచేటట్లు తాబేలు అవతారం ఎత్తావు.
 ఓ కేశవ! నీవు కూర్మావతారం ధరించావు. ఓ జగదీశ్వరా! ఓ హరే! నీవు విజయవంతునిగా ఉండుగాక!

3. వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్నా

శశిని కళంక కలేవ నిమగ్నా

కేశవ! ధృత సూకరరూప! జయ జగదీశ! హరే!

అర్థం: భూమి నీ దంతాల అగ్రభాగంలో స్థిరంగా వుంది. మబ్బుల్లో చిరునవ్వులా నీలంగా మెరిసిపోతూ, బాలచంద్రుని యందు కళంకరేఖవలె నీ కోఱయందు అందంగా వెలుగొందింది.
 ఓ కేశవ! నీవు వరాహావతారం ధరించావు. ఓ జగదీశ్వరా! ఓ హరే! నీవు విజయవంతునిగా ఉండుగాక!

4. తవ కరకమల వరే నఖమద్భుత శృంగం

దళిత హిరణ్యకశిపు తను భృంగం

కేశవ! ధృత నరహరిరూప! జయ జగదీశ! హరే!

అర్థం: నీ దివ్య హస్త కమలాల్లో నఖములు అద్భుతమైన ఆయుధాలుగా మారాయి. వాటితో నీవు హిరణ్యకశిపుని బలిగొన్నావు.
 ఓ కేశవ! నీవు నరసింహావతారం ధరించావు. ఓ జగదీశ్వరా! ఓ హరే! నీవు విజయవంతునిగా ఉండుగాక!

5. ఛలయసి విక్రమణే బలిమద్భుత వామన!

పదనఖ నీర జనిత జన పావన

కేశవ! ధృత వామనరూప! జయ జగదీశ! హరే!

అర్థం: ఓ అద్భుత వామ నా ! నువ్వు నీ చిన్న రూపంతో మహాబలిని మోసపుచ్చి, మూడు అడుగుల భూమి అడిగి విశ్వాన్ని నీ అధీనంలోకి తెచ్చుకున్నావు.
 నీ పాదాల నుంచి జలధారలు ఉద్భవించి జనులను పవిత్రం చేశాయి.
 ఓ కేశవ! నీవు వామనావతారం ధరించావు. ఓ జగదీశ్వరా! ఓ హరే! నీవు విజయవంతుడవుగా ఉండుగాక!

6. క్షత్రియ రుధిర మయే జగదపగత పాపం

స్నపయసి పయసి శమిత భవ తాపం

కేశవ! ధృత భృగుపతిరూప! జయ జగదీశ! హరే!

అర్థం: క్షత్రియుల రక్తంతో భూమిని శుద్ధి చేసి, వారి అహంకారాన్ని నశింపజేశావు.21 మారులు క్షత్రియులను సంహ రించి వారి రక్తంతో తడిసిన ' శమంత పంచక మను చెరువును కల్పించి, అందు స్నానము చేసేవారు పాపాలనూ, సంసారతాపాలనూ పోయేటట్లు సౌఖ్యం పొందేలా దయ చూపించావు. .
 ఓ కేశవ! నీవు పరశురామావతారం ధరించావు. ఓ జగదీశ్వరా! ఓ హరే! నీవు విజయవంతునిగా ఉండుగాక!

7. వితరసి దిక్షు రణే దిక్పతి కమనీయం

దశముఖ మౌళి బలిం రమణీయం

కేశవ! ధృత రామశరీర! జయ జగదీశ! హరే!

అర్థం: నీవు రఘువంశములో పుట్టి రావణుని పది తలలను తెగ నరికి పది దిక్కుల లో పదుగురు దిక్పాలురకు ప్రీతిగా బలి ఇచ్చావు. ధర్మాన్ని స్థాపించావుఈ విధంగా యుద్ధంలో అన్ని దిశలకు నీ మహిమాన్వితమైన ప్రభావం వ్యాపించింది.

ఓ కేశవ! నీవు రామావతారం ధరించావు. ఓ జగదీశ్వరా! ఓ హరే! నీవు విజయవంతునిగా ఉండుగాక!

.

8. వహసి వపుషి విశదే వసనం జలదాభం

హల హతి భీతి మిళిత యమునాభం

కేశవ! ధృత హలధరరూప! జయ జగదీశ! హరే!

అర్థం: నాగేటి దెబ్బకు భయ పడి వచ్చిన యమునా నదియా అన్నట్లు బలరామావతారంలో మేఘమువలె నల్లనైన వస్త్రాన్ని ధరించావు, గోకులాన్ని రక్షించావు .
 ఓ కేశవ! నీవు బలరామావతారం ధరించావు. ఓ జగదీశ్వరా! ఓ హరే! నీవు విజయవంతునిగా ఉండుగాక!

9. నిందసి యజ్ఞవిధే రహహ శ్రుతిజాతంసదయ హృదయ దర్శిత పశు ఘాతం

కేశవ! ధృత బుద్ధశరీర! జయ జగదీశ! హరే!

అర్థం: అయ్యో! హరీ ! ఎంతపని చేసావ్ ! నీవు కలియుగ రాక్షసులను మోసము చేయాలనుకొన్నావు. అందుకే బుద్దావతారము ధరించి , యజ్ఞము అను కారణంతో పశుహింస చేయువారి మార్గాన్ని మరల్చటానికి - వేదములు ప్రమాణములు కావని - - నీవే బోధించావు.
 ఓ కేశవ! నీవు బుద్ధావతారం ధరించావు. ఓ జగదీశ్వరా! ఓ హరే! నీవు విజయవంతునిగా ఉండుగాక!

10. మ్లేచ్ఛనివహ నిధనే కలయసి కరవాలం

ధూమకేతుమివ కిమపి కరాలం

కేశవ! ధృత కల్కిశరీర! జయ జగదీశ! హరే!

అర్థం: కలియుగము చివర నీవు ధూమకేతువులాగా భయానకంగా ఉన్న . ఖడ్గాన్ని ధరించి, మ్లేచ్ఛులను (దుష్టులను) సంహరించడానికి వస్తావు. నీవు ఓ కేశవ! నీవు కల్కి అవతారం ధరిస్తావు. ఓ జగదీశ్వరా! ఓ హరే! నీవు విజయవంతునిగా ఉండుగాక!

11. శ్రీ జయదేవకవే రిదముదిత ముదారం

శృణు సుఖదం శుభదం భవసారం

కేశవ! ధృత దశవిధరూప! జయ జగదీశ! హరే!

అర్థం: ఈ అద్భుతమైన శ్లోకాలను జయదేవుడు వ్రాసాడు. ఈ అష్టపదులు శుభప్రదమైనవి, మోక్షాన్ని ప్రసాదించేవి.
 ఓ కేశవ! నీవు ఈ పది అవతారాలను ధరించావు. ఓ జగదీశ్వరా! ఓ హరే! నీవు విజయవంతునిగా ఉండుగాక!

కొన్ని విశేషాలు

ధ్రువపదం అనేది పాటలో పదే పదే పాడబడే పంక్తి (refrain) లేదా కొరస్. ఇది ప్రతి చరణం చివరలో మారని స్థిరమైన భాగంగా ఉంటుంది. "ధ్రువత్వాచ్చ ధ్రువో జ్ఞేయః" అనగా "స్థిరత్వం వల్ల దీనిని 'ధ్రువ' అని పిలుస్తారు" అనే అర్థాన్ని కలిగి ఉంది. జయ జగదీశ లో, జయ జగదీశ! హరే! పంక్తి ప్రతి చరణం చివరలో పునరావృతమవుతుంది. ఇది పాటకు ఒకటిగా ముడిపడి, భక్తి భావాన్ని పెంచేందుకు సహాయపడుతుంది. భక్తి సంప్రదాయంలో ధ్రువపదం ముఖ్యమైనది, ఎందుకంటే ఇది పాట యొక్క ప్రధాన భావాన్ని బలపరచడమే కాకుండా, భక్తులకు సులభంగా పాడేలా చేస్తుంది.

ఒకరు ప్రశ్నించవచ్చు, "మీరు తానే యజ్ఞాల నియమాలను రూపొందించినప్పటికీ, వాటికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆశ్చర్యకరంగా, మీరు వేదాల ఆది ప్రచారకుడే అయినా, ఇప్పుడు వాటిని తప్పుబడుతున్నారా?"దీనికి కవి సమాధానం ఈ విధంగా ఉంది: "సదయ-హృదయ దర్శిత-పశు-ఘాతం" - అంటే "మీరు ప్రాణులపట్ల (పశువులకు) కరుణ కలిగినవారై, అహింసా పరమో ధర్మః అని బోధించి, దానివల్ల అసురులను మాయచేసారు. మోహిని మూర్తిగా రూపం దాల్చి, అమృతాన్ని రక్షించడానికి అసురులను మాయ చేశారుగా, అదేవిధంగా, అసురులను మాయచేసి పశువులను రక్షించేందుకు బుద్ధ రూపంలో మీరు యజ్ఞాలను అప్రాముఖ్యంగా ప్రకటించారు." భగవంతుని హృదయం, యజ్ఞాల్లో పశువులపై జరుగుతున్న హింసను చూసి కరుణతో నిండిపోయింది. కరుణతో ప్రేరితమై, పశువుల హితార్థం కోసం యజ్ఞాలను నిందించడానికి ఈ బుద్ధ అవతారాన్ని ధరించారు.

కలియుగాంతంలో యుద్ధం లేకుండా, క్రూర జన నాశనం చేయబడదు. అలాంటి నాశనం లేకుండా శాంతి నెలకొనదు. అందుచేత, స్వామి కల్కిరూపాన్ని ధరించి, అసభ్యులను సంహరిస్తారు. కవి "కిమపి" అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా ఆ ఖడ్గం భయానికి స్వరూపమని సూచించాడు."ధూమకేతుమివ" – ధూమకేతు అనేది ఒక భయానక నక్షత్రం, ఇది అనివార్యమైన వినాశానికి సూచికగా నిలుస్తుంది. భగవంతుని ఖడ్గం ధూమకేతువుగా, అసభ్య మానవుల కోసం సమీపిస్తున్న అపాయాన్ని తెలియజేస్తుంది. "ధూమకేతు" అనే పదానికి "అగ్ని" అనే అర్థం కూడా ఉంది, ఇది కల్కి యొక్క ఖడ్గం అసభ్య సమాజానికి ఎంత భయానకమైనదో సూచిస్తుంది.

4. నితంబినీచుంబితవక్త్రబింబః .... అని ఒక శ్లోకం ఉన్నది.

నితంబినీ - పద్మినీజాతి స్త్రీ చేత -

చుంబిత - ఆ -స్వాదింపబడిన-

వక్త్రబింబః-అధరబింబముగలిగినట్టిన్ని

శుకద్యుతిః-శుక-చిలుక యొ క్క-

ద్యుతిః-కాంతివంటి కాంతిగలిగినట్టిన్ని -

కుండలవా - కణకుండల ధరుడైనట్టి న్ని

-ప్రశస్తః-ప్రసిద్ధుడైనట్టిన్ని

-మాలాధరః:- మౌక్తికహారమునుధరించినట్టి -

మాళవ రా గరాజ:- మాళవ రాగమనెడిరాజు-

ప్రదోషే-ప్రదోష కాలమందు -

సంగీతశాలాం-సం గీతసభను-

ఆవిశత్- ప్ర వేశిం చెను-(

అను ఈ శ్లోకము ప్రకారముగా సకల రాగములకు మా ళవరాగము రాజైనందువలనన పురుష రాగమైనందువలనను-మాళవరా గేణగీయతే-అ ని జయదేవుని అష్ట పదులకు మొదట ఉన్నది

No comments:

Post a Comment

12. నాథ హరే సీదతి రాధా వాసగృహే

  12. నాథ హరే సీదతి రాధా రాగము: గుణకరి రాగము తాళము: రూపక తాళము పల్లవి  నాథ హరే సీదతి రాధా వాసగృహే ॥   ప్రతిపదార్థము: నాథ = ఓ నాథుడా! (రక్...